తూర్పు గోదావరి జిల్లాలో యువత.. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో సారా తయారీ చేస్తున్నారు. కొందరైతే ఎప్పుడు చూడని విధంగా.. ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. తప్పు చేస్తే ఎలాగైనా.. ఎప్పుడైనా దొరకాల్సిందే. దొరికిపోయి జైలుకు వెళుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో సారా వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా సారా తయారీ కేంద్రాలు పెరిగిపోయాయి. మద్యం ధరలు పెరగటంతో మందుబాబులు నాటుసారాపై ఆసక్తి కనబరుస్తున్నారు. నాటు సారాకు డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు యువకులు మెట్ట ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో నాటు సారా తయారీపై దృష్టి పెట్టారు. కొంతమంది యువత తయారు చేస్తుంటే.. మరికొందరు అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు సైతం ఇదేంటి? ఇలా కూడా తరలిస్తారా? అనుకునేలా చేస్తున్నారు.
పిఠాపురం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు బైక్ మెకానిక్. ఈజీ మనీపై దృష్టి పెట్టాడు. తెలిసిన విద్యతో తన బజాజ్ డిస్కవరీ వాహనాన్ని సారా తరలించడానికి అనువుగా మార్చాడు. రోజుకు 35 నుంచి నలభై లీటర్ల సారా తరలిస్తూ.. వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ రోజు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం నుంచి పిఠాపురానికి సారా తరలిస్తుండగా ప్రత్తిపాడు ఎక్సైజ్ ఎస్ఐ రామశేషయ్య, కానిస్టేబుల్ గౌస్ మహద్దేన్.. రాచపల్లి వద్ద పట్టుకొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా నిలవాలని రాహుల్ పిలుపు