తూర్పుగోదావరి జిల్లా పోర్టులు, పరిశ్రమలున్న ప్రాంతం. పెట్టుబడులకు, పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రధాన రైలు మార్గం కాకినాడ మీదుగా ఇప్పటివరకు లేకపోవడం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. కాకినాడ నగర ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు ఎక్కాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో కాకినాడకు ప్రధాన రైల్వే లైను మంజూరైనా..ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. మొదట్లో ఈ రైల్వే లైను అంచనా వ్యయం 220 కోట్లు కాగా ప్రస్తుతం 500 కోట్లకు చేరింది.
కోటిపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వరకు సాగుతున్న కోటిపల్లి-నర్సాపురం కొత్త రైల్వేలైను పనులు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. 2వేల888కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వ వాటా నిధులు మంజూరు కాకపోవడంతో..పనులు ఆగిపోయాయి. దీనికితోడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వచ్చే భక్తుల కోసం స్టేషన్‌లో స్నానపు గదులు, అదనపు టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం స్టేషన్ల అభివృద్ధిపై ప్రజలనుంచి విన్నపాలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో ఈసారైనా జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తారేమోనని అక్కడి ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: కేంద్ర పద్దుపై కోటి ఆశలు.. హోదా, రైల్వే జోన్ అమలుపై ఎదురుచూపులు!