ఆరేళ్ల దాంపత్య జీవితం ఆ జంటది. 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలు వారికి ఉన్నారు. అయితే ఈ అందమైన కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. భార్యతో మనస్పర్థల కారణంగా ఆ చిన్నారుల ప్రాణాల్ని తీసేశాడు భర్త. అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాంలో విలేకరి ఆత్మహత్య ఘటన వివరాలివి.
ముమ్మిడి శ్రీనివాస్ ఓ పత్రికలో విలేకరిగా పనిచేసేవారు. ఇతని స్వస్థలం కాకినాడలోని కొండయ్యపాలెం. ఆరేళ్ల క్రితం కాకినాడకు చెందిన లావణ్యను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు 5 ఏళ్ల కవల పిల్లలు హర్ష, హర్షిణి ఉన్నారు. దిన పత్రికల ఏజెన్సీని సైతం అతను నిర్వహిస్తున్నాడు. వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నారు శ్రీనివాస్.
చాలా కుటుంబాల మాదిరే శ్రీనివాస్, అతని భార్యకు మధ్య తరచూ మనస్పర్థలు వచ్చేవి. ఈ వ్యవహారాన్ని పెద్దల సమక్షంలో పెట్టారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. భార్యతో జరిగిన గొడవలతో అతను మూడు రోజులు ఇంటికి వెళ్లలేదు. భర్త తనను వేధిస్తున్నాడంటూ లావణ్య గత శుక్రవారం యానాం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే రోజు పోలీసులు సుమారు మూడున్నర గంటల సేపు భార్యభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ పరిణామాలతో శ్రీనివాస్ మనస్తాపానికి గురయ్యాడు.
శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని శ్రీనివాస్ బైక్‌పై బయలుదేరి వెళ్లిపోయాడు. యానాంలోని బాలయోగి వారధి వద్దకు చేరుకుని ఇద్దరు పిల్లల్ని గౌతమి గోదావరిలోకి విసిరేశాడు. అనంతరం తానూ నదిలోకి దూకాడు. అప్పటి నుంచి శనివారం సాయంత్రం వరకు యానాం పోలీసులు, స్థానిక మత్స్యకారులు గోదావరిలో విస్తృతంగా గాలించగా పిల్లల మృతదేహాలు దొరికాయి. ఆదివారం ఉదయం ముమ్మిడి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. ఇలా పిల్లలతో సహా ఓ తండ్రి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం యానాం వాసులని కలిచివేసింది.
ఇదీ చదవండి