Chandrababu Invitation For Mahanadu: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆహ్వానాలు పంపుతున్నారు. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ఈ ఆహ్వాన పత్రికల్ని రూపొందించారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు నాంది పలికారన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను.. మహానాడు వేదికగా మరింత ఘనంగా తెలుగుదేశం జరుపుకుంటోందని తెలిపారు. ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 27న మహానాడును జరుపుకోవటం సంప్రదాయమని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. రాజమహేంద్రవరం వేమగిరిలో నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాలపై చర్చ జరుగుతుందని వివరించారు. మే 28న జరిగే భారీ బహిరంగ సభలో భాగస్వాములు కావాలని చంద్రబాబు ఈ మేరకు ఆహ్వానాలు పంపారు.
రెండింతలు పెరిగిన విమాన టికెట్ల ధరలు: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు సుమారు లక్షల్లో వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే విదేశాల నుంచి మహానాడుకు వచ్చే వారికి విమానం టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్-రాజమండ్రి రూట్‍లో గరిష్టంగా రూ.11వేల 631 వరకు విమాన టిక్కెట్ ధరలు ఎకబాకాయి. తెలంగాణతో పాటు విదేశాల నుంచి భారీగా పార్టీ నేతలు, అభిమానులు వస్తుండడంతో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. సాధారణ టికెట్ ధర రూ.3వేల 461 ఉండగా మహానాడు డిమాండ్‍తో రెండింతలు పెరిగాయని తెలుగుదేశం శ్రేణులు వాపోతున్నారు. బెంగళూరు-రాజమండ్రి రూట్‍లోనూ ఈ రెట్టింపు ప్రభావం కనిపిస్తోంది.
బ్లేడ్ బ్యాచ్‌ను దింపి నగరంలో ఎంపీ భరత్ అల్లర్లు: ఈ నెల 27, 28వ తేదీల్లో రాజమండ్రిలో నిర్వహిస్తున్న మహానాడు అనుమతుల కోసం రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి జోహార్, ఇతర నాయకులు ఎస్పీ కార్యాలయంకు వెళ్లారు. నగరంలో అల్లర్లు లేపుతూ బ్లేడు బ్యాచిని దింపి ఎంపీ భరత్ విర్రవీగుతున్నాడని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మీద బురదజల్లే పనిలోనే నిమగ్నమైనట్లు తెలుస్తుందని తెలిపారు. ఎంపీ భరత్ చేసే ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలో ఎటువంటి అల్లర్లు, అల్లకల్లోలాలు జరిగిన దానికి భరత్ తప్ప వేరొకరు కారణం కాదని ప్రజలు స్పష్టంగా గమనిస్తారని మాజీ మంత్రి జవహర్ అన్నారు. గొప్ప హోదాలో ఉండి కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సరికాదని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆరోపించారు. ఈ పిల్ల చేష్టలన్నిటికీ కారణం రాజకీయ అనుభవం లేకపోవడం, ప్రజా సమస్యలను అత్యంత సమీపంగా, పరిశీలనాత్మకంగా తెలుసుకోకపోవటమే కారణమని విమర్శించారు.
ఇవీ చదవండి: