కరోనా తరుముతున్న వేళ.. పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రుల్లో ఆందోళన వాస్తవమే. ఈ నేపథ్యంలో.. నవంబరు 2 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ తెరుచుకోనున్నాయి. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు పాఠ్యాంశాలు బోధించేందురు చర్యలు పూర్తయ్యాయి. పాఠశాలలకు వచ్చే ప్రతి విద్యార్థిని జాగ్రత్తగా చూసుకుంటామని.... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు సాగేలా చూస్తామని తూర్పుగోదావరి జిల్లా విద్యాధికారి ఎస్.అబ్రహం పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలల పునఃప్రారంభం వేళ తరగతుల నిర్వహణకు చర్యలు, మౌలిక వసతులు, ఇతర అంశాలపై ‘ఈనాడు’, ఈటీవీ భారత్తో మాట్లాడారు.
ప్ర: వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, పిల్లలు ఒకచోట చేరితే ఇబ్బంది కదా?
డీఈవో: 1-10 వరకు అన్ని యాజమాన్యాల కింద 7,416 పాఠశాలల్లో 7,47,225 మంది ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు 18,419 మందిలో 14 వేల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 139 మందిలో పాజిటివ్ గుర్తించాం. వీరు మినహా మిగిలిన వారిని బోధనకు అనుమతిస్తాం. 3 వేల మంది బోధనేతర, మధ్యాహ్న భోజన సిబ్బంది ఉన్నారు. మిగిలిన ఉపాధ్యాయులు, సిబ్బందికి రెండ్రోజుల్లో కొవిడ్ పరీక్షలు పూర్తి చేస్తాం. పిల్లలకు థర్మల్ స్క్రీనింగ్ చేశాకే గదిలోకి అనుమతిస్తాం. సచివాలయ పరీక్షలకు కొనుగోలు చేసిన థర్మల్ మీటర్లు జేసీ సమకూరుస్తున్నారు. మిగిలినవి కొనే ఏర్పాట్లు చేశాం.
ప్ర: పిల్లలను పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇస్తారు?
డీఈవో: విద్యాసంవత్సరం కోల్పోకూడదనే పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూరదర్శన్‌లో ‘విద్యావారధి’ ద్వారా 1-10 వరకు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో నాలుగు తరగతులను ప్రసారం చేస్తోంది. అందరూ దృష్టి పెడుతున్నారో లేదో చెప్పలేం. అందుకే ప్రత్యక్ష తరగతుల ద్వారా చదువులు చెప్పి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. అన్ని పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ప్ర: తరగతుల నిర్వహణ ఎలా?
డీఈవో: ఒకరోజు తొమ్మిదో తరగతికి, మర్నాడు పదో తరగతికి.. ఇలా రోజు మార్చి రోజు బోధిస్తాం. ఒక గదిలో 16 మందే ఉంటారు. బెంచీకి ఒకరు చొప్పున కూర్చునే ఏర్పాటు చేస్తున్నాం. తరగతులయ్యాక శానిటైజేషన్, శుభ్రతను ప్రధానోపాధ్యాయులే చూస్తారు.
ప్ర: విద్యాకానుక కిట్ల పంపిణీ, పాఠ్యపుస్తకాల అందజేత పూర్తయిందా?
డీఈవో: 4.2 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇచ్చాం. బూట్లు, దుస్తులు, సాక్సులు మూడు జతలు, బెల్ట్, బ్యాగు, రాత, పాఠ్య పుస్తకాలు ఇచ్చాం. 25 లక్షల పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశాం. తరగతుల సమర్థ నిర్వహణపైనే దృష్టిసారించాం.
ప్ర: పిల్లలకు మాస్కులు, శుభ్రతపై ఏం చేస్తారు?
డీఈవో: ప్రతి పాఠశాలకు ఒక ఏఎన్‌ఎంను కేటాయిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఏఎన్‌ఎంలు తొలిరోజు పాఠశాలల్లో పిల్లలకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. ఉదయం ప్రార్థన- అసెంబ్లీ ఒకేచోట ఉండదు. ఎవరి తరగతుల్లో వారే చేస్తారు. అప్పుడే జాగ్రత్తలను వివరిస్తాం. ఉదయం తరగతులయ్యాక.. మధ్యాహ్న భోజనం పెట్టి ఇళ్లకు పంపిస్తాం. నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం, తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి జాగ్రత్తలు వివరిస్తాం. బయటకు వెళ్లే పిల్లలకు బుద్ధులు చెప్పడంలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ చూపాలి.
ప్ర: మధ్యాహ్న భోజనం వేళ జాగ్రత్త ఎలా?
డీఈవో: ప్రస్తుతం 9, 10 తరగతుల విద్యార్థులు 1,39,966 మంది వస్తారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న సిబ్బందినే వంటకు అనుమతిస్తాం. వారు శానిటైజ్ చేసుకుని, మాస్కులు ధరించాలి. పలు సంస్థలు మధ్యాహ్న భోజనం అందించే చోట కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తాం. భోజనం వేళ పిల్లలు భౌతిక దూరం పాటించేలా ప్రధానోపాధ్యాయులు చూస్తారు.
ప్ర: ‘నాడు- నేడు’ మేరకు బోధనకు అనువుగా ప్రాంగణాలు సిద్ధమయ్యాయా?
డీఈవో: రూ.350 కోట్లతో నాడు- నేడు పనులు 1,334 పాఠశాలల్లో జరుగుతున్నాయి. వీటిలో 350 వరకు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో తరగతులు జరగనున్నందున వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ దిశగా దృష్టిసారించాం. పనులు తుది దశకు చేరుకున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం.
ఇదీ చదవండి: