భూయజమానులు లేని ఖాళీ స్థలాలను గుర్తించి, వాటికి నకిలీ హక్కుదారుల పేరిట దస్తావేజులను సృష్టించి పక్కా ప్రణాళిక ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న కొందరి వ్యక్తులపై ఇటీవల సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు మొత్తం రాజమహేంద్రవరం కేంద్రంగా జరిగినా.. దీనికి సంబంధించిన మూలాలన్నీ విజయవాడలోనే ఉన్నాయి.
రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి పంచాయితీ జాతీయ రహదారికి అనుకుని కంచుమర్తి పార్ధసారధి అనే జమీందారుకి 15.53 ఎకరాల భూమి ఉంది. ఆయనకు వారసులు లేకపోవటంతో ఆ భూమి పోరంబోకు స్థలంగా మారింది. విజయవాడ మధురానగర్‌కు చెందిన ఎలుగుబంటి హరిబాబు దీనిపై కన్నేశాడు. అక్కడ పనిచేసే రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని నకిలీ పత్రాలను సృష్టించాడు. అప్పటికే ఆ స్థలం ద్వారా ఫలసాయం పొందుతున్న వారిని బలవంతంగా గెంటేశాడు. అనంతరం ఆ భూమిని రాజమండ్రికి చెందిన ఓ కంపెనీకి అభివృద్ధి కోసం ఇచ్చాడు. అవి నకిలీ పత్రాలు అని తేలింది. హరిబాబుతో పాటు.. అతని స్నేహితుడు ఆళ్ల శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీసుల అధికారుల పాత్ర ఉందని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసులో నిందితుడైన ఆళ్ల శ్రీనివాసరావు తనకు సంబంధం లేని వ్యవహారంలో తనను, హరిబాబును ఇరికించారని, ఈ భూకుంభకోణంలో సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశాడు. సీఎం ఈ కేసును సీఐడీకి అప్పగించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు. దీంతో గతనెల 8వ తేదీ హరిబాబుతో పాటు.. ఆయన కుటుంబసభ్యులు ముగ్గురిపైనా, ఆ సమయంలో అక్కడ పనిచేసిన నూజివీడు సర్వేయర్ రామకృష్ణ, జి. శ్రీనివాసరావు, తహసీల్దారు గోపాలకృష్ణ డీటీ జి.బాపిరాజు, ఆర్ఐ మణిదీప్, సీఐలు చెన్న కేశవరావు, కనకరావు (ప్రస్తుతం నందిగామ సీఐ), విశ్రాంత ఏఎస్ఐ వరప్రసాద్, ఆర్ రఘురామ్, టి.వెంకటరామరెడ్డిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: నేటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ