తుఫాన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ముంపునకు గురై మునిగిపోయిన పంటపొలాలను తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరిశీలించారు. అన్నదాతలు నష్టాల ఊబిలో కురుకున్నారని.. తక్షణమే వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టం తీవ్రత లెక్కలు వేయకుండా ప్రతి బాధిత రైతుకు పరిహారం చెల్లించాలన్నారు. పట్టణంలోని ఆలమూరు, ఏడిద రోడ్డు, గొల్లపుంత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం పంట నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సర్వం కోల్పోయాం..
ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రధాన మురికి కాలువలో మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పొలాల్లోని నీరు బయటకు వెళ్లే వీలులేక ఎగదన్నటంతో పంట నష్టం జరిగి సర్వం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు రోజుల నుంచి పొలాలన్నీ నీటిలోనే ఉన్నాయని.. ఆందోళన వ్యక్తం చేశారు.
ముంపు ప్రాంతాల్లో పొలాల నుంచి కొంత మేర నీరు తగ్గుతుండటంతో వరి నేలనంటుతోందన్నారు. వరి కంకులు నీట మునగటంతో రంగు మారిందన్నారు. మరో నెల రోజుల్లో పంట చేతికి అందే సమయంలో తుఫాను తమకు కోలుకోలేని నష్టం కలిగించిందని వాపోయారు.
తక్షణమే స్పందించాలి..
ముంపునకు గురైన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ల డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖాధికారులను ఆయన ఆదేశించారు.
ఇవీ చూడండి : శరన్నవరాత్రులు.. నర్సీపట్నం నుంచి ప్రత్యేక బస్సులు