నివర్ తుపాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రోజులు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు వీచిన ఈదురు గాలులకు వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. మెట్ట ప్రాంతంలో అధికశాతం రైతులు వరి సాగు చేశారు. కొన్ని చోట్ల వరి ధాన్యం కళ్లాల్లో ఉంది. తడిసిన ధాన్యాన్ని రైతులు రోడ్ల పై ఆరబెట్టుకొని శుభ్రం చేసుకొంటున్నారు.
ప్రత్తిపాడు మండలంలోని చిన్నశంకర్లపూడి, ఒమ్మంగి, పెద్దిపాలెం గ్రామాల్లో వరి పంటలు నీటమునిగాయి. పత్తి, కూరగాయలు పంటలు కూడా దెబ్బతిన్నాయి. తుపాన్ ధాటికి చేతికి అందివచ్చిన పంట నీళ్లపాలు అయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి... తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు.
తుపాను ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను ప్రత్తిపాడు తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజా పరిశీలించారు. దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులను ప్రభుత్వం తక్షణనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: