అగ్నిప్రమాదాలు జరిగినపుడే కాకుండా వరదలు, విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది స్పందిస్తున్న తీరు అభినందనీయమని హోంమంత్రి సుచరిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కోటి రూపాయలతో నిర్మించిన జిల్లా అగ్నిమాపక కార్యాలయాన్ని మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, విశ్వరూప్, కాకినాడ ఎంపీ వంగా గీత తదితరులతో కలిసి ఆమె ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక కార్యాలయాల్లో సౌకర్యాల మెరుగుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత చెప్పారు. శాశ్వత భవనాల నిర్మాణానికి 28 కోట్లు కేటాయించాలన్న అగ్నిమాపక డీజీ విన్నపాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానమన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక, పోలీసులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు, మీడియా ప్రాణాలకు తెగించి సేవలందిస్తుండటం అభినందనీయమని కొనియాడారు.
రాష్ట్రంలో ఏడాది కాలంలో ముఖ్యమంత్రి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారని తెలిపారు. సున్నా వడ్డీకింద 1400 కోట్లు కేటాయించారని... విద్యాదీవెన పాత బకాయిలు చెల్లించారన్నారు. మే నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందించారని హోంమంత్రి తెలిపారు.