Heavy Rains in Two Godavari Districts: తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల ధాటికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరి వరి పంట నీట మునిగింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిగ్‌జాం తుపాను రైతులను నట్టేట ముంచింది. భారీ వర్షాలు వరి, అపరాలు, మొక్కజొన్న పంటను వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఏలూరు జిల్లా చింతలపూడిలో కోతకు వచ్చిన వరి పంట రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రగడవరం గ్రామంలో చెరువు పక్కనే ఆరబోసిన ధాన్యం తడిచిపోవడంతో జేసీబీ సాయంతో పక్కకు తీశారు.
తుపాను నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో సీఎం జగన్ విఫలం : టీడీపీ నేతలు
యర్రగుంటపల్లిలో చేతికొచ్చిన వేరుశెనగ పంట నీటమునిగిందని రైతులు వాపోయారు. ఉంగుటూరు మండలంలో ధాన్యం రాశులను వరద ముంచెత్తింది. దెందులూరు, కొవ్వలి, పోతునూరు, దోసపాడు, ఉండ్రాజవరం, సత్యనారాయణపురం, కొత్తగూడెం గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సకాలంలో గోనె సంచులు, రవాణా సదుపాయం కల్పించకపోవడంతోనే ధాన్యం నీటిపాలైందని రైతులు మండిపడ్డారు.
"పంట కోసి పది రోజులైంది. సంచుల కోసం తిరిగాము. తేమ శాతం 17 వరకు తగ్గాలని అంటున్నారు. తేమ శాతం తగ్గిన సంచులు అందలేదు. లారీలు అందుబాటులో లేవు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము." -ధాన్యం రైతు
తుపాను బీభత్సంతో నీటమునిగిన పంటలు - సర్కారు సాయం అందక అన్నదాతల కుదేలు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులకు తుపాను కన్నీటిని మిగిల్చింది. ముమ్మిడివరంలో కోతకొచ్చిన వందల ఎకరాల వరి నేలమట్టమైంది. రావులపాలెం, గోపాలపురం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో ఆరబోసిన ధాన్యం నీటమునిగింది. అరటి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చిరుతపూడిలో కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.
తుపాను విసిరిన పంజా ధాటికి.. అనకాపల్లి జిల్లాలో వేల ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి. నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం ప్రాంతాల్లో వందల ఎకరాల్లో వరి నీటిలో నానుతోంది. కల్లాల్లో పోసిన ధాన్యం తడిచిపోవడంతో సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నిబంధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
పంట నీటి పాలైందని మహిళా రైతు కన్నీరు - మనసు చలించే దృశ్యం
"పంటలు నేలమట్టమయ్యాయి. అవి ఎందుకూ పనికిరాకుండా కుళ్లిపోయాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని సహాయం చేస్తే తప్పా, మేము ఏమీ చేయలేము." -రైతు