తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు సాంబశివరావుపేటలో దంగేటి సత్యనారాయణ, సత్యవతి దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమారుడు నాగరాజు.. భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు. ఇంట్లో సత్యవతి ఒక్కరే ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి ఇంటికెళ్లాడు. మీ అబ్బాయి నాగరాజు, నేను స్నేహితులమని సత్యవతిని నమ్మించాడు. మీరు వేలిముద్ర వేస్తే చేయూత పథకంలో నగదు వస్తుందని.. నిన్ను సచివాలయం వద్దకు తీసుకెళ్లమని మీ అబ్బాయి చెప్పాడని నమ్మబలికి ఆమె సచివాలయం వద్దకు తీసుకెళ్లాడు. తాను మళ్లీ వచ్చే వరకు వేలిముద్ర వేయవద్దని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి 5 కాసుల బంగారు ఆభరణాలు తస్కరించాడు. ఏం తెలియనట్లు తిరిగి సచివాలయం వద్దకు వెళ్లి వేలి ముద్ర వేయాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్లిపోయాడు.
ఇంటికి వెళ్లిన సత్యవతి చోరీ జరిగినట్లు గుర్తించి కంగుతిన్నది. మోసపోయామని తెలుసుకొని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.
ఇదీ చదవండి..
job calendar: విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు