Peoples facing problems with flood: గోదావరి మహోగ్రరూపంతో విలీన మండలాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న ఈ గ్రామాల్లో పునరావాస చర్యలు పూర్తికాకపోవడంతో.. వేలేరుపాడు, కుక్కునూరు, ఎటపాక మండలాల్లో ఇళ్లు నీటమునిగాయి. జనం కట్టుబట్టలతో మిగిలారు. గొడ్డు, గోదా చెల్లాచెదురయ్యాయి. పునరావస కేంద్రాల్లో అరకొర వసతుల మధ్య మరికొందరు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
పోలవరం పునరావాస ప్రాంతమైన ఎర్రబోరును గోదారి ముంచెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. గ్రామాలు ఖాళీ చేయాలన్న అధికారుల హెచ్చరికలతో.. ప్రజలు ముఖ్యమైన, విలువైన సామగ్రిని తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. కొందరికే అధికారులు సహరిస్తున్నారని.. తమ పశువులను సైతం కాపాడుకోలేని దుస్థితికి వెళ్లామని ఆవేదన వ్యక్తం చేశారు.
వేలేరుపాడులోని పునరావస శిబిరాల్లోనూ సరైన వసతులు లేవని....ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని.. గ్రామస్థులు వాపోయారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం తాము అన్నీ వదులుకుంటే... తమ గోడు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. త్వరగా పునరావాసం పూర్తి చేస్తే తామే ముంపు ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోతామంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేదని భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్న ఎటపాక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి వరదలో ఉన్న తమను ఎవరూ పలకరించలేదన్నారు.
ఇదీ చదవండి: