గోదావరికి వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రాజమహేంద్రవరం చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేశారు. వీటితో పాటు ఇంద్రావతి, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీ వరద చేరుతోంది. వరదతో భద్రాచలం వద్ద నీటిమట్టం 42 అడుగులకు చేరింది. ధవళ్వేవరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10 అడుగులు చేరింది. వరద పెరడం వలన డెల్టా కాల్వలకు 8700 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. ధవళేశ్వరం గేట్లు ఎత్తి 7 లక్షల 82 వేల పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
భారీగా పంట నష్టం
గోదావరి వరద పోటుతో దేవీపట్నం మండలంలోని పలుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంకగ్రామాల్లోకి నీరు చేరడం వలన రాకపోకలు స్తంభించాయి. పడవలు పైనే ప్రజలు ప్రయాణిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విలీన మండలాలు ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి. మిరప, పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. చింతూరు, వీఆర్పురం మండలాలు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదతో కోనసీమ గోదావరి పాయాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం మండలంలో కకాలపాలం కాజ్వే పైనుంచి వరదనీరు పారుతోంది. ఆదివారానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భయం గుప్పిట్లో లంక గ్రామాలు
గోదావరికి వరద నీరు పెరుగుతున్న పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో లంకగ్రామాలు భయం గుప్పిట్లో బతుకుతున్నాయి. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి నీటిని విడిచిపెట్టడం వలన కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం గౌతమి వంతెన వద్ద, గోపాలపురంలోని వశిష్ఠ వంతెనల వద్ద గోదావరి ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. వరదతో రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాలోని లంక పొలాలకు వరద ముంపు పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: