గోదావరి జిల్లాలను కలిపే ప్రధాన వారధులు నిత్యం రద్దీగా ఉంటాయి. గామన్, రోడ్కమ్, ధవళేశ్వరం వంతెనలపై వేలాదిగా సరుకు, పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను వాహనాలపై తరలిస్తుంటారు. అటువంటి ఈ మార్గాలు... ప్రస్తుతం గుంతలు పడి అధ్వాన్నంగా మారాయి. ప్రమాదాలకు నెలవుగా మారిపోయాయి. దుమ్ము, ధూళితో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రుల్లో దీపాలు పనిచేయక... ప్రయాణించడం నరకంగా మారిందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
గుంతలమయంగా గామన్ వారధి...
ఈ గామన్ వారధిని నిర్మించి నాలుగేళ్లు కావొస్తుంది. ఇప్పటికే 16సార్లు మరమ్మతులు చేశారు. ఈ వారధిపై విజయవాడ వైపు నుంచి విశాఖకు 50 కిలోమేటర్ల దూరం తగ్గుతుంది. భారీ వాహనాలు, లారీలు అన్నీ దీని మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి వంతెన అనుసంధాన రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.
ప్రమాదాలకు నిలయం...
దీనిపై గతేడాది నుంచి ఇప్పటి వరకు 15 ప్రమాదాల్లో 11 మంది మృత్యవాతపడ్డారు. మరో 13 మంది క్షతగాత్రులయ్యారు. అంతేగాక నిత్యం ఏదో ఒక ప్రమాదంలో వాహనదారులు కిందడపడటం పరిపాటిగా మారింది. వారధిపై రాత్రిపూట విద్యుత్ దీపాలు వెలగటంలేదు. ఫలితంగా ప్రయాణం కష్టమౌతోందని వాహనదారులు వాపోతున్నారు.
దీని పరిస్థితి మరి అధ్వాన్నం...
రోడ్కమ్ వంతెనపై రోజు 20 వేల వాహనాల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో సరిగా మరమ్మతులు చేయక జాయింట్ల మధ్య దూరం పెరుగుతోంది. రోడ్డుపై వేసిన తారు కూడా పాడైంది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణగోడలు శిథిలావస్థకు చేరాయి. వంతెనపై 19 ప్రమాదాల్లో 8 మంది చనిపోగా... 19 మంది క్షతగాత్రులయ్యారు.
కాటన్ బ్యారేజీపై తప్పని తిప్పలు...
గోదావరి జిల్లాల వరదాయిని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. రహదారి, మధ్యలో ఉన్న గొయ్యిలు వాననదారుల్ని ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. ఆనకట్టపైనా 20 ప్రమాదాలు జరగ్గా... నలుగురు చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి...
ఇప్పటికైనా ప్రతిష్టాత్మక వారధులపై... మరమ్మతులు చేసి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవీ చదవండి