Girlfriend killed her boyfriend: నాలుగేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ముఖం చాటేసిన ప్రియుడ్ని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి మరీ ప్రియురాలు హత్య చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గోకవరం మండలం తిరుమల పాలెం గ్రామానికి చెందిన ఒమ్మి నాగ శేషు (26) గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకొని జీవన సాగిస్తుంటాడు. రంపచోడవరం మండలం చిలక వీధికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో చదువుతున్న సమయంలో నాగశేషుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే నాగ శేషు కుటుంబ సభ్యులు ఏడాది క్రితం గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన యువతితో నాగశేషుకు వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని నాగశేషు ప్రియురాలి వద్ద దాచి ఉంచాడు. ఇటీవల ప్రియురాలికి విషయం తెలియడంతో పలుమార్లు నాగశేషుతో గొడవ పడింది.
ఈ నేపథ్యంలో నాగశేషుని ఏలాగైనా అంతమొందిచాలనుకున్న ఆ యువతి.. తన స్నేహితుడు రాజవొమ్మంగి మండలం దూసరపాముకు చెందిన శివన్నారాయణతో కలిసి బుధవారం అర్ధరాత్రి సమయంలో ప్రియుడు నాగశేషు ఇంటికి వెళ్లింది. డాబాపై నిద్రిస్తున్న నాగశేషు వద్దకు వెళ్లి నిద్రలేపి గొడవకు దిగింది. దీంతో కొంచెం సేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావటంతో.. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తిపీటతో నాగశేషుపై దాడి చేసింది. ఆమెతో వచ్చిన తన స్నేహితుడు కర్రతో దాడి చేశాడు. నాగశేషు తండ్రి పక్కనే ఉన్నా వారించలేదు.
సుమారు మూడు గంటలు గడిచిన తర్వాత ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నాగశేషును అంబులెన్సులో ఎక్కించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే అతడు ప్రాణాలు విడిచాడు అని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్సై శివ నాగబాబులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగశేషుకు ఈ మధ్యనే వివాహం అయింది.. ప్రస్తుతం తండ్రితో పాటు ఇంట్లో ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఒక కుర్ల జుబేదా అనే అమ్మాయితో పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే ఇక్కడికి వచ్చి నాగశేషుతో గొడవ పడి కట్టడం జరిగింది.. అది చుట్టుపక్కల వారు చూసి వచ్చి అతనిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. ఈలోపే అతను చనిపోయాడని తెలిసింది.. రిపోర్టుల ఆధారంగా విచారిస్తున్నాం ముద్దాయిలను అరెస్టు చేసి వారికి తగిన శిక్ష పడే విధంగా చూస్తాం.- కడలి వెంకటేశ్వరరావు, డీఎస్పీ
ఇవీ చదవండి: