కేంద్ర పాలిత పుదుచ్చేరి రాష్ట్రంలో చిట్ట చివరి నియోజకవర్గమైన తూర్పుగోదావరి జిల్లాలోని యానాం శాసనసభ స్థానానికి మాజీ ముఖ్య మంత్రి రంగస్వామి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది జనవరి 6వ తేదీన పుదుచ్చేరి రాష్ట్ర మంత్రిగా, ఫిబ్రవరి 15న శాసనసభ సభ్యత్వాలకు... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మల్లాడి కృష్ణారావు. అయితే ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికలలో తాను పోటీ చేయనని.. తన కంటే సమర్ధులైన నాయకుడిని నిలబెడతానంటూ రెండు నెలలుగా పుదుచ్చేరి..యానాం ప్రజలలో నెలకొల్పిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించారు. ఆయన అభిమానులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
అభివృద్ధి కోసమే నిర్ణయం: మల్లాడి
గడచిన ఐదు సంవత్సరాలుగా గవర్నర్ కిరణ్ బేడీ కారణంగా యానాం అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని.. మరో ఐదేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే యానాం ఉనికే కనుమరుగవుతుందన్నారు మల్లాడి. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఎమ్మెల్యేగా ఉండే కంటే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రినే యానాం నుంచి ఎమ్మెల్యేగా పంపిస్తే మనం ఆశించిన అభివృద్ధిని చూడగలుగుతామని...అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్లాడి కార్యకర్తలకు వివరించారు.
అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: మల్లాడి
1996 సంవత్సరం నుంచి 2016 వరకు జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీని పెంచుకుంటూ గెలిపించారని.. రాబోయే ఎన్నికల్లో నేనే పోటీలో ఉన్నట్లుగా భావించి మన రంగస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
ఇదీ చదవండి: