కంప్యూటర్లో తూకంలో తేడాగా నమోదు చేసి ఆయిల్ ఫామ్ గెలల సేకరణ నిర్వాహకులు రైతులను మోసం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని రుచి సోయా కంపెనీ.. జిల్లాలో పలుచోట్ల ఆయిల్ ఫామ్ గెలల సేకరణను కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. రంగంపేట మండలం జి.దొంతమూరులోనూ రైతుల వద్దనుంచి గెలల సేకరణ జరుగుతోంది. అయితే కంప్యూటర్ కాంటాలో నూతన టెక్నాలజీని వినియోగిస్తూ రైతులకు నెత్తిన టోపీ పెడుతున్నారు దొంతమూరు గెలల సేకరణ కేంద్ర నిర్వాహకులు. తూకం తక్కువగా వచ్చే సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఏర్పాటు చేసుకుని రైతులను మోసం చేస్తున్నారు. తూకంలో తేడాలను గుర్తించిన రైతులు నిర్వాహకులను నిలదీయగా.... వారు నిజం అంగీకరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఎలా మోసం చేశారో.. ఎక్కడెక్కడ అమలు చేశారనే విషయాలను తెలిపారు. ఈ వివరాలను కంప్యూటరు ఆపరేటర్‌గా పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తి.. రైతు సంఘం నాయకులు, కంపెనీ ప్రతినిధులకు చెప్పాడు. గెలల సేకరణలో తప్పు జరుగుతుందనే అనుమానంతో ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నామని ..ఎట్టకేలకు అది రుజువైందని రాష్ట్ర ఆయిల్‌ఫామ్ రైతుల సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి రామారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పెండ్యాల బుజ్జిబాబు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నష్టం గుర్తిస్తామని.. కంపెనీ యజామాన్యం తెలిపింది. మిగిలిన ప్రాంతాలపైనా కూడా దృష్టి సారిస్తామని రుచిసోయా కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పట్టాభిరామిరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు