Family members Mulakat with Chandrababu: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ములాఖత్‌లో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిలు కలిశారు. ములాఖత్ అనంతరం జైలు వద్దకు వచ్చిన టీడీపీ నేతలు రామ్మోహన్, బుచ్చయ్య చౌదరి, కొల్లు రవీంద్ర, చినరాజప్పలతో నారా లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం జైలు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
Kala Venkatarao Comments: రాజమండ్రి జైలు వద్ద మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ..''చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైద్యులు ఇచ్చిన మందుల వల్ల ఉపశమనం లేదని సమాచారం. చంద్రబాబుకు నిర్వహించిన పరీక్షలపై వైద్యుల సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని భువనేశ్వరి లేఖ రాశారు. రక్త నమూనాలను చంద్రబాబు వ్యక్తిగత వైద్యులకు పంపితే సూచనలిస్తారు. పాత మందులకు మార్పులు, చేర్పులు తెలియజేస్తారు. చంద్రబాబు వైద్య పరీక్షల వివరాలు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టారు. రాష్ట్రంలో రాక్షస క్రీడ ఆడుతున్నారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని పోలీసులను పావులుగా వాడుతున్నారు'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP Nijam Gelavali Program: 'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి
Kollu Ravindra Comments: అనంతరం మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడి ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులకు వివరాలు ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఆరోగ్య వివరాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖత్ కాకుండా చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. భయపడుతూ పరిపాలన చేయాల్సిన అవసరం ఉందా..? అని నిలదీశారు. చంద్రబాబు అరెస్టు నుంచే జగన్ కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. 'వైఎస్సార్సీపీ నేతలు వారి సమాధులకు వారే పునాదులు వేసుకుంటున్నారు. భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు వస్తే అరెస్టు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే మూల్యం చెల్లించుకోవాలి' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
''జైలులో చంద్రబాబు నాయుడుకు అధికారులు ఇచ్చే మందులతో ఆయనకు ఎటువంటి ఉపశమనం లభించడం లేదని మాకు తెలుస్తోంది. చంద్రబాబుకు చేస్తున్న వైద్య పరీక్షలు గానీ, వైద్యుల సూచనలు గానీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని మేము కోరాం. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన ఆ కాపీని మాకు ఇస్తే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అందరికీ ఒక అవగాహన వస్తుంది. చంద్రబాబుకి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ హైదరాబాద్, విజయవాడలో ఉన్నారు. వారికి ఆ వైద్య పరీక్షల నివేదికలను పంపిస్తే వారు చంద్రబాబుకు మరింత మెరుగ్గా వైద్య సేవలు సూచించేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది.''-టీడీపీ నేతలు, రాజమహేంద్రవరం