తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లోనే ఎస్సీ యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు పోలీసులు. ఈ ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్సీలను కావాలనే అణిచివేయాలని చూస్తుందని దుయ్యబట్టారు.
4 రోజులు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన బాలికకు న్యాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ బాలికపై అత్యాచారం, మరో ఎస్సీకి శిరోముండనం ఇదేనా మాకు న్యాయం? అంటూ మండిపడ్డారు. ఎస్సీ ప్రజాప్రతినిధులు, హోంమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇది అవమానం అని పేర్కొన్నారు. ఎస్సీలను కచ్చితంగా అణిచివేయాలనే ప్రభుత్వం చూస్తోందని హర్షకుమార్ ఆరోపించారు.
పెయిడ్ బ్యాచ్‌లను ప్రభుత్వం డబ్బులిచ్చి పోషిస్తోందని హర్షకుమార్ ఆరోపించారు. పార్టీల ముసుగులు వదిలేసి అందరూ ఈ ఘటనలను ఖండించాలని కోరారు. 24 గంటల్లో ఎస్సీ యువకుడి శిరోముండనం వెనుక ఉన్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీతానగరం వద్ద అక్రమ ఇసుక ర్యాంపులన్నీ నిలిపివేయాలన్నారు. 24 గంటల్లో పోలీసు అధికారులపై, సూత్రధారులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం