చీరమేను. దీపావళి వచ్చిందంటే.. ఈ పేరు గోదావరి జిల్లాల్లో బాగా వినిపిస్తుంటుంది. మాంసాహార ప్రియులకు నోరు ఉరేలా చేస్తుంటుంది. టపాసులు కాలుస్తూ ఆనందిస్తూనే.. ఎప్పుడెప్పుడు చీరమేనును ఆస్వాదిద్దామా అని ఆరాటపడేలా చేస్తుంది. చేప జాతుల్లో అతి చిన్నది.. సముద్ర జలాల మీనం రకానికి చెందినది అయిన ఈ చీరమేను చేప.. దీపాల పండగ సమయంలోనే ఎక్కువగా లభిస్తుంది.
గోదావరి నది పాయల్లో... అక్టోబర్, నవంబర్ నెలల్లో వీచే తూర్పు గాలుల ఫలితంగా చీరమేను చేపలు లభిస్తాయి. ముఖ్యంగా దీపావళికి వచ్చే.. అమావాస్య సమయంలో ఈ జాతి చేప ఎక్కువగా కనిపిస్తుంటుంది. పూర్వీకులు చీరలతోనే ఈ చేపను వేటాడిన కారణంగా.. చీరమేను అన్న పేరు ఈ చేపకు స్థిరపడిందని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు చెబుతారు.
తూర్పు గోదావరి జిల్లా యానం, గౌతమి గోదావరి నది పాయలో మత్స్యకారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు.. పోటు సమయంలో చీరలతో వేటని సాగిస్తారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా కుటుంబ సభ్యులంతా పాల్గొని సేకరించిన చీరమేను చేపలను.. బాక్సుల్లో పెట్టి మార్కెట్లో వేలానికి పంపిస్తారు. దక్కించుకున్న వ్యాపారులు.. కొంత లాభానికి అమ్ముకుంటారు. రుచిలో భిన్నంగా ఉండే ఈ చీరమేను కొనుక్కునేందుకు స్థానికులతో పాటు ఇతర జిల్లాల వాసులూ పోటీపడుతుంటారు. ఒకప్పుడు బిందె చీరమేను వెయ్యి రూపాయల ధర పలికేదట. ఇప్పుడు మాత్రం ఆ ధర లక్ష రూపాయలుగా ఉంది. చిన్న క్యారేజ్ ధర 5 వేలు. గోదావరిలో ఈ చేప లభ్యత తగ్గిపోవడమే ఇందుకు కారణమని మత్స్యకారులు చెప్తున్నారు.
సముద్రపు నీటిలో గోదావరి నీరు కలిసే సమయంలో ఈ చేప పుట్టి.. ధవళేశ్వరం వరకు వెళుతుందని మత్స్యకారులు చెప్పారు. అనంతరం 50 జాతుల చేపల్లో ఏదో ఒక చేపగా ఎదుగుతుందన్నారు.
ఇదీ చూడండి: