సుజిత్ విల్సన్....! కొద్దిరోజులుగా జాతీయస్థాయిలో వినిపిస్తున్న పేరు. బోరు బావిలో పడిపోయిన ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని యావద్దేశం ప్రార్థించింది. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబమూ అదే పనిచేసింది. సుజిత్ బయటకు వస్తే చూడాలన్న ఆశతో టీవీకే అతుక్కుపోయింది. అదే... ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. వారి రెండేళ్ల పాప నీటితొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ జరిగింది..
తమిళనాడు త్రెస్పురం గ్రామంలో మూడేళ్ల పసిపాప రేవతి సంజన నిన్న రాత్రి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి చనిపోయింది. ఆ సమయంలో పాప తల్లిదండ్రులు బోరుబావిలో పడిపోయిన సుజిత్ విల్సన్ గురించి టీవీలో వస్తున్న వార్తలు చూస్తున్నారు. ఫలితంగా వారు చిన్నారిని గమనించలేదు. దీనితో ఘోరం జరిగిపోయింది.
తరువాత కొద్దిసేపటికి పాప గురించి వెతికిన వారికి నీటి తొట్టిలో చలనం లేకుండా ఉన్న చిన్నారి కనిపించింది. హుఠాహుఠిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:- అశ్రునయనాల మధ్య సుజిత్‌కు తుది వీడ్కోలు