తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం వద్ద గోదావరిలో నీరు మళ్లీ పెరుగుతోంది. ఎగువ కాఫర్ డ్యాంను మూసివేయడంతో వెనుక భాగంలోని ముంపు గ్రామాల నిర్వాసితులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం పోశమ్మగండి వద్ద నది ఒడ్డునున్న ఇళ్లలోకి వరద చేరింది. సాయంత్రానికి ఆలయం మెట్ల వద్దకు దాదాపు అడుగుపైనే నీరు చేరింది. నది ఒడ్డునున్న నిర్వాసితులు ఇళ్లను ఖాళీ చేసి కొండలపైకి చేరుకున్నారు. పూడిపల్లి-పరగసానిపాడు గ్రామాల మధ్య రహదారిపై భారీగా నీరు చేరడంతో ఇళ్లలోంచి సామగ్రిని బయటకు తెచ్చుకుంటున్నారు. పాఠశాలను వరద నీరు ముంచెత్తింది.
దండంగి - డి.రావిలంక మధ్య రహదారి పైనుంచి గోకవరం వైపునకు రాకపోకలు నిలిచాయి. పూడిపల్లి వద్ద సీతపల్లి వాగుకు పోటెత్తిన గోదావరి కె.వీరవరం గ్రామాన్ని చుట్టుముట్టింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఉదయం 6 గంటలకు 27.10 మీటర్ల నీటిమట్టం ఉండగా సాయంత్రం 6 గంటలకు 27.14 మీటర్లకు చేరింది.
మరోవైపు.. సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 4 నుంచి మొదలైన పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శనివారం 2 బోట్లలో వెళ్లేందుకు 129 మంది ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేశారని ఏపీటీడీసీ తూర్పుగోదావరి జిల్లా డివిజినల్ మేనేజర్ టి.ఎస్.వీరనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి:
రోడ్డు లేదు.. పడవల్లోనూ రానివ్వరు.. పోలవరం నిర్వాసితులకు కష్టాలు