కరోనా ఆంక్షల నేపథ్యంలో.. తిండి లేక అల్లాడుతున్న పేదలకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పేద వారికి ఆహార పొట్లాలు పంచారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన రైల్వే ఉద్యోగి రాజాబాబు.. ప్రత్యేక వాహనంపై తిరుగుతూ.. పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు. తుని ఆర్టీసీ డిపో పరిధిలోని సిబ్బంది బృందాలుగా ఏర్పడి.. సేవలందిస్తున్నారు. అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తున్నవారికి కరోనా ముప్పుపై అవగాహన కల్పిస్తున్నారు. రావులపాలెంలోని లిటిల్ ఫ్లాక్ లూథరన్ చర్చి చైర్మన్ కప్పల వరప్రసాద్, డానియల్ ఇశ్రాయేలు సమకూర్చిన నిత్యవసర కిట్లను 400 మంది పేదలకు... ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చేతుల మీదుగా అందచేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గంలోని జర్నలిస్టులకు..10 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నరసన్నపేటలో పలువురు యువకులు నూతన ఆలోచనతో ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. మూగజీవులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చారు. పశు దాణాతో పాటు నీళ్లు ఇచ్చి.. మూగజీవాల దాహార్తిని తీర్చారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని 11, 12వ వార్డులో సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి తన సొంత ఖర్చులతో... ఇంటికి కేజీ చొప్పున.. 1,500 కేజీల చక్కెర పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ.. పేద ప్రజలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతపురం నగర శివారులోని పేద ప్రజలకు తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని యాచకులందరికీ.. గడియారం స్తంభం సెంటర్లో ఎమ్మెల్యే రజిని మధ్యాహ్న భోజనం అందజేశారు. లాక్‌డౌన్ ఉన్నంతవరకూ.. యాచకులందరికీ తానే రోజూ ఆహారపొట్లాలు, మంచినీళ్లు ఉచితంగా అందజేస్తానని తెలిపారు.
విశాఖలో ఇబ్బంది పడుతున్న రోజు కూలీలకు రోటరీ క్లబ్, ఇన్ ట్రాక్టర్స్ క్లబ్, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా ఉచిత భోజన ప్యాకెట్లను అందజేస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో నివాసముంటున్న విశ్రాంత స్కూల్ అసిస్టెంట్ దాసరి రత్నరాజు.. కాలనీలోని 600 కుటుంబాలవారికి ఉచితంగా కూరగాయలు అందిస్తున్నారు.
కృష్ణా జిల్లా మంగినపుడి బీచ్, తాళ్ళపాలెం, పెదపట్నం పంచాయతీలో నిరాశ్రయులైన పేదలకు వింగ్స్ ఔట్ రీచ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పాతపాటి దేవదాసు.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బందరు రూరల్ మండలంలోని గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయ, వైద్య, పోలీసు సిబ్బందికి వైకాపా నేత వాలిశెట్టి రవిశంకర్ చేతుల మీదుగా శానిటైజర్లు, మాస్క్లు అందజేశారు.
నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని షార్ ఉద్యోగుల సంఘాల నాయకులు షార్ పరిసర గ్రామాల్లోని 100మంది పేదలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందించారు.
లాక్‌డౌన్ కొనసాగినంత కాలం తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పలువురు దాతలు తెలిపారు.
ఇదీ చదవండి: