DISASTER MANAGEMNT: ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. గురువారం రాత్రికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. బ్యారేజి వద్ద ప్రవాహం 20 లక్షల క్యూసెక్కులకు చేరితే.. ఆరు జిల్లాల పరిధిలోని 554 గ్రామాలపై ప్రభావం పడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కోనసీమలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 8, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాల్లోని గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని విపత్తులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు. వరద నేపథ్యంలో కరకట్టలు, కల్వర్టులు, వంతెనల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు.
నౌకాదళం సేవలు
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత నౌకాదళం సహాయక చర్యలు చేపట్టింది. ఏలూరు జిల్లా పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు రెండు యూహెచ్3 హెలికాప్టర్లను పంపినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. వేలేరుపాడు మండలంలో జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి అవసరమైన మందులు, రెండు వేల కిలోల ఆహారాన్ని (రొట్టెలు, పాలు ప్యాకెట్లు) ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాజమహేంద్రవరానికి చేరవేశాయని పేర్కొన్నాయి. శుక్రవారం కూడా సేవలు అందజేయనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: