తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి రథం దగ్ధం ఆయిన సంఘటనపై విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తూ ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేరుగాంచిన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భద్రత కల్పించడంలో విఫలమయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో భద్రత సక్రమంగా లేకపోవడం వల్ల ఈ దారుణం జరిగిందని.... దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఖండించిన భాజపా
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను భాజపా ఖండించింది. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా భాజపా నాయకులకు సూచించారు. అదే విధంగా ఈ ఘటనను అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ఖండించారు.
అంతర్వేది ఘటనపై విచారణ జరగాలి: స్వరూపానంద
అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్దం కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతర్వేది ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అన్నారు. దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం