అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా... జిల్లాలోని బఫర్ జోన్ లోని దేవాలయాల్లోకి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని ఈవో వివరించారు.
అన్నవరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. స్వామివారి దర్శనానికి గురువారం నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. 10 గంటల తర్వాత స్వామివారికి నిర్వహించే కార్యక్రమాలను ఏంకాంతంగా, శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తామని, భక్తులకు 8 గంటల వరకు మాత్రమే వ్రత టిక్కెట్లు ఇస్తామన్నారు. స్వామివారి నిత్య కల్యాణం, అమ్మవారి చండీ హోమం, తదితర వాటికి భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆయా పూజలకు ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించి పరోక్షంగా భక్తులు పాల్గొనవచ్చునని చెప్పారు. కేశఖండనశాల కూడా ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు.