గోదావరికి వరద పోటు కారణంగా.. తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాలు నీటిలో చిక్కుకున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతం లోతట్టు భూముల్లో కూరగాయల పంటలన్నీ నీటమునిగాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమీ గోదావరి నదీ.. పాయలుగా పోటెత్తడంతో పల్లపు లంక భూముల్లో పంటలు మునిగిపోయాయి. బీర, బెండ, మునగ, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు తదితర పంటలు సుమారు వెయ్యి ఎకరాల్లో ముంపునకు గురయ్యాయి.
పి.గన్నవరం, ఆత్రేయపురం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు, సఖినేటిపల్లి తదితర మండలాల్లో లోతట్టు లంక భూముల్లోకి వరద నీరు చేరింది. ఈ కారణంగా సుమారు వెయ్యి ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు నీటిలో మునగడంపై.. రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
వరద ఉద్ధృతి గురించి ముందుగానే సమాచారం ఇస్తే.. పండిన కూరగాయలు కోసుకుంటాం. సమాచారం లేకపోవడం వల్ల పంటలన్నీ నీట మునుగుతున్నాయి. పరిహారం.. భూ యజమానికే వెళుతోంది. కౌలు రైతులకు ఆ నగదు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. -అమ్మిరాజు, కౌలురైతు
ఇదీ చూడండి:
Huge Floods to Sreesailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. 2 రోజుల్లో నిండే అవకాశం!