తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రజలు ఏమాత్రం అనుమానం ఉన్నా స్వచ్ఛందంగా దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో చేసే పరీక్షలు మినహాయిస్తే జిల్లాలో అయిదుచోట్ల కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తున్నారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, రాజానగరంలోని జీఎస్ఎల్ ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌తోపాటు బొమ్మూరు క్వారంటైన్ కేంద్రంలో ఉచితంగా స్వాబ్ నమూనాలు సేకరించి, పరీక్షలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా కరోనా పరీక్ష చేయించుకోవాలనుకున్న వ్యక్తి ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆరు దశల్లో రిపోర్టు పొందవచ్ఛు ఉదాహరణకు కరోనా పరీక్ష కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి ఓ వ్యక్తి వెళితే ఇలా పరీక్ష చేస్తున్నారు.
1 ఆధార్ రిజిస్ట్రేషన్
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని రెండు విభాగాలుగా చేశారు. కరోనా, సాధారణ ఆసుపత్రిగా విభజించారు. కరోనా ఆసుపత్రికి వెళ్లేవారికి ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. వార్డులోని ఓపీ కేంద్రం వద్ద ముందుగా పేరు నమోదు చేయించుకోవాలి. మనకు వచ్చిన నంబరు ఆధారంగా పేరు వచ్చినప్పుడు ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నంబరుతో ఓపీ కేంద్రం వద్దకు వెళ్తే వివరాలు నమోదు చేసుకుని వైద్యుల వద్దకు పంపిస్తారు.
2 ఓపీలో వైద్యుల సూచనలు..
మీరు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా వచ్చారు.. వంటి వివరాలు వైద్యులు తెలుసుకుంటారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఉష్ణోగ్రతను తెలుసుకుని ఐసీఎంఆర్ రిజిస్ట్రేషన్‌కు పంపిస్తారు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే వారిని ఫలితం వచ్చే వరకు ఆసుపత్రి క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తారు.
3 ఐసీఎంఆర్‌లో వివరాలు
ఐసీఎంఆర్ పత్రంలో మీ వివరాలు నమోదవుతాయి. అక్కడికి ఓపీ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ఈ పత్రాలను రూపొందిస్తారు. స్వాబ్ తీసేందుకు వ్యక్తి అందుబాటులో ఉన్నాడా? లేదా? అని తెలుసుకునేందుకు పేరు పిలిచి కిట్లు పొందేందుకు పంపిస్తారు.
4 కిట్ల అందజేత
తరువాత పరీక్షకు నమూనాలు సేకరించే కిట్లు రోగులకు అందిస్తారు. ఐసీఎంఆర్ పత్రం, కిట్‌ను ఒక కవర్లో ఉంచి పరీక్షకు వచ్చిన వారికి ఇస్తారు. వీటీఎం కిట్ ద్వారా సేకరించి స్వాబ్ ఫలితం రావడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. వీఎల్‌ఎం కిట్టు ద్వారా సేకరించిన స్వాబ్‌కు 24 గంటల్లో ఫలితం వస్తుంది. వీఎల్‌ఎం కిట్ల కొరత ఉంటే తప్ప వీటీఎం కిట్లలో నమూనాలు సేకరించడం లేదు.'
5 స్వాబ్ సేకరణ ఇలా..
కిట్లు పొందినవారు వరుస క్రమంలో స్వాబ్లు ఇచ్చేందుకు ఈఎన్టీ వైద్యుని వద్దకు వెళ్లాలి. వారు ఆయా వ్యక్తుల ముక్కు లేదా గొంతు లోంచి నమూనాలు తీసి ల్యాబ్‌కు పంపుతారు. ప్రతిఒక్కరికీ స్వాబ్ తీసిన అనంతరం ఆ పరిసర ప్రాంతంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
6 మొబైల్‌కు సంక్షిప్త సందేశం
ల్యాబ్‌లో పరీక్షల అనంతరం ఫలితాలను ఓపీలో నమోదు చేయించుకున్న మొబైల్ నంబరుకు సంక్షిప్త సందేశాన్ని పంపిస్తారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి ఐసీఎంఆర్ జనరేషన్ కేంద్రంలో సంప్రదిస్తే ఫలితం వివరాలను పేపరు రూపంలో ప్రింటు తీసి రోగులకు అందజేస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి హోం ఐసోలేషన్ లేదా ఆసుపత్రి ఐసోలేషన్‌కు ప్రతిపాదించి, చికిత్స అందిస్తారు.
ఇదీ చదవండి: ఈ ఏడాది ఇంట్లోనే యోగా దినోత్సవం: మోదీ