తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు తదితరులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నో మాస్క్-నో ఎంట్రీ మార్గదర్శకాలను తు.చ.తప్పకుండా పాటించాలన్నారు. అత్యధిక కేసులు నమోదైన జిల్లా అని కాకుండా.. అత్యధిక కేసులను గుర్తించిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచినట్లు పేర్కొన్నారు.
కేసులు తగ్గాయనే కారణంతో నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం, సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్-19పై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఈ నెల 21 ప్రారంభమయ్యాయని.. ఇవి 30న ముగుస్తాయని తెలిపారు. లారీ, ట్యాక్సీ, ఆటో తదితర యూనియన్ల ప్రతినిధులతో పాటు యాజమానుల అసోషియేన్లతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పారిశ్రామిక గ్రూపులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లాలో కేసుల సంఖ్య బాగా తగ్గిందని, అమలాపురం మినహా మిగిలిన అన్ని డివిజన్లలోని కొవిడ్ ఆసుప్రతుల్లో పడకల ఆక్యుపెన్సీ సగటున 45 శాతంలోపే ఉంటోందని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లోనూ నాన్ కొవిడ్ వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందించడంపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే 14 వేల మంది ఉపాధ్యాయులకుగానూ.. 10వేల మందికి పరీక్షలు పూర్తయినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: నవంబర్‌లో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' మూడో దశ ట్రయల్స్