తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 1086 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,232 కు చేరింది. రాజమహేంద్రవరం, కాకినాడ నగర, గ్రామీణ మండలాల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
అలాగే కోనసీమతోపాటు, మండపేట, రామచంద్రాపురం, కరప, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, అనపర్తి, కొత్తపేట, జగ్గంపేట, తదితర మండలాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకూ పెరుగుతూనే ఉంది. మన్యంలోని రంపచోడవరం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి మండలాల్లోనూ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. వైరస్ బారినపడి 9 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 65కు చేరింది
పరీక్షల కోసం తరలివస్తున్న ప్రజలు...కానీ
పాజిటివ్ కేసులు పెరిగి పోతుండటంతో...పరీక్షలు చేయించుకునేందుకు జనం ఆరోగ్య కేంద్రాలకు తరలి వస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడల్లో వరసగా రెండో రోజూ సంచార సంజీవని సంచార వాహనాల వద్ద కోవిడ్ పరీక్షలు చేపట్టలేదు. పడిగాపులు పడిన జనం ఇళ్లకు తిరిగి వెళ్లారు. కాకినాడలో రాత్రి తొమ్మిది గంటల వరకు వాహనాల వద్దే ఉన్నారు. పరీక్షలు చేయక పోవడంపై నిరసన తెలిపారు.
కేసులు పెరుగుతున్నా భయం లేదు
కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నా జనం ఆయా ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. జిల్లాలో దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉంది. ఆ సమయాల్లో ప్రధాన కూడళ్లు, కూరగాయల మార్కెట్లలో అధిక రద్దీ ఉంటోంది. రాజమహేంద్రవరం దేవీచౌక్, మెయిన్ రోడ్డులలో అధిక రద్దీ కనిపించింది. కాకినాడ, అమలాపురంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీచూడండి
యాంటీజెన్ పరీక్షల్లో అస్పష్టత... పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్