తూర్పు గోదావరి అధికార పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు బజారుకెక్కింది.రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్(MP NARGANI BHARATRAM), రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(MLA JAKKAMPUDI RAJA)ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఏడాదిగా పోటాపోటీగా ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటున్న ఇరువురు.. తాజాగా పరోక్షంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన నేపథ్యంలో.. ‘ఇద్దరూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. రోడ్డుకెక్కి బహిరంగంగా మాట్లాడుకోవడం పార్టీ లక్ష్మణరేఖను దాటడమే. ఇప్పటికే ఒకసారి చెప్పి చూశాం. మరో మూడు రోజుల్లో పిలిపించి మాట్లాడవచ్చు’ అని అధిష్ఠాన వర్గం చెబుతోంది.
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలకు ఆజ్యం పోసింది ఆవ భూముల కొనుగోలు వ్యవహారమేనన్న ప్రచారం పార్టీలోనూ, బయటా ఉంది. ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి రాజా నియోజకవర్గ పరిధిలోని కోరుకొండ మండలంలో ఈ భూములను గతేడాది సేకరించారు. ఎకరా రూ.7లక్షలు పలకని భూములకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇప్పించారని, ఇందులో కుంభకోణం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే రాష్ట్రస్థాయిలో పెద్ద చర్చ జరిగింది. ఈ భూముల సేకరణలో తెదేపా మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ భరత్ వ్యవహారం నడిపించారని ఎమ్మెల్యే రాజా ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అక్కడ మొదలైన విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.50-60 లక్షలు ఇప్పిస్తామని చెప్పి రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు యూనియన్ బ్యాంకులో 45-50 మంది రైతులతో ఒకేరోజు బ్యాంకు ఖాతాలు తెరిపించారు. వారి నుంచి ఎకరాకు రూ.25 లక్షలు చెక్కులను ముందుగానే తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మా పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయం ఉంది’ అని రాజా పరోక్షంగా ఎంపీనుద్దేశించి బహిరంగంగా విమర్శించారు. ‘నిరాధార ఆరోపణలు చేయడం తగదు, పురుషోత్తపట్నం రైతుల నుంచి చెక్కులు తీసుకున్నట్లు ఆధారాలుంటే నిరూపించాలి. నీతులు చెప్పే ఆ ప్రజాప్రతినిధి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. వారు చిటికేస్తే వచ్చేది బ్లేడ్ బ్యాచ్‌లు, చైన్ స్నాచింగ్, గంజాయి ముఠాలే’నంటూ ఎంపీ భరత్ పరోక్షంగా రాజానుద్దేశించి విమర్శించారు.
రాజకీయంగా ఎవరికి వారే
రాజకీయంగానూ భరత్‌రామ్, రాజా మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఒకే లోక్‌సభ నియోజకవర్గ పరిధి అయినప్పటికీ సొంత పార్టీ కార్యక్రమాల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి పాల్గొంటున్న సందర్భాలు అరుదు. రాజానగరంలో ఎంపీ కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం, రాజమహేంద్రవరానికి వచ్చి ఎమ్మెల్యే పర్యటిస్తున్నారంటూ ఎంపీ వర్గం పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. పురుషోత్తపట్నం విషయంలో రాజాకు అనుకూల రైతులు ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా, ఎంపీ తరపున కొన్ని కులసంఘాల ప్రతినిధులు మాట్లాడుతున్నారు. తన కుటుంబ ప్రాబల్యాన్ని తగ్గించేలా కుట్ర చేస్తున్నారంటూ రాజా ఎంపీపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. ‘ఎంపీ నిధుల నుంచి రాజానగరం నియోజకవర్గానికి రూ.60 లక్షలు కేటాయించాను. ఆ నిధులతో పనులు చేపట్టేటప్పుడు ఎంపీని పిలవాలని కూడా తెలియని వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నార’ంటూ ఎంపీ భరత్ ప్రతిస్పందించారు.
ఇదీ చూడండి: గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వ కార్యాచరణ