తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చ్‌ల్లో బిషప్‌లు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు.. కేంద్రపాలిత ప్రాంతమయిన యానాంలో క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే రోమన్ క్యాథలిక్ చర్చ్‌ల్లో బిషప్‌లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు మతాలకతీతంగా కొవ్వొత్తులు వెలిగించి, ప్రభు పై తమ భక్తిని చాటుకున్నారు. పశువుల పాకలో బాలయేసు జననం అలంకరణలు.. సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలోనే ప్రార్థన మందిరాలకు అనుమతిచ్చారు.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు..
కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చులను నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. రావులపాలెంలోని బేతేస్థా ప్రార్ధన మందిరంలో చిన్నారులు పాడిన పాటలు, నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యుత్ కాంతులతో రాజమహేంద్రవరంలోని చర్చ్‌లు..
రాజమహేంద్రవరంలోని లూధరన్, ఏపీ ఫినియ చర్చల్లో క్రిస్మస్ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్దలు భక్తి గీతాలు పడుతూ.. ప్రార్ధనలు చేశారు. అలాగే విద్యుత్ కాంతులతో చర్చులను సుందరంగా అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.