చంద్రబాబుకు హాని తలపెట్టాలని ఆలోచన ఉన్నట్లు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా తెలుస్తుందని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. అనుమతి లేకుండా డ్రోన్స్‌తో చంద్రబాబు నివాసం దృశ్యాలు తీయడంపై పార్టీ శ్రేణులు, రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొందని కాకినాడలో అన్నారు. వరద నీటిలో రాజధాని నిర్మాణాలను ముంచేయాలనేదే వారి ఉద్దేశంలా ఉందని విమర్శించారు. అమరావతి నుంచి చంద్రబాబును వెళ్లగొట్టాలని... రాజధానిని తరలించాలనేది వైకాపా వ్యూహంలా కనిపిస్తోందన్నారు. ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ కక్షపూరిత చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. 75రోజుల పాలనలోనే జగన్ ప్రజలకు చుక్కలు చూపించారని మండిపడ్డారు. ఇసుక కొరతతో లక్షలాదిమంది జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. గ్రామ వాలంటీర్ పోస్టుల్లో నూరు శాతం వైకాపా కార్యకర్తలనే నియమించారని ఆరోపించారు. పోలవరం నిర్మాణంపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల ఖర్చు పెరగటమే కాకుండా.. జాప్యమవుతుందన్నారు. ప్రాజెక్టు అథారిటీ చెప్పినా జగన్ మొండివైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో జగన్ మూడో ఉత్తమ సీఎంగా నిలిచారన్న అంశంపై తీవ్రంగా స్పందించారు. రెండు నెలల్లోనే ఉత్తమ సీఎం అయిపోతారా అని ప్రశ్నించారు. జగన్ గొప్ప సీఎం కాదు.. బ్యాడ్ సీఎంగా నిలిచారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి :