తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న కొండేపూడిలో విశాదం జరిగింది. ముక్కుపచ్చలారని 15 రోజుల శిశువును బావిలో పడేసి హత్య చేసిన ఘటనలో నిందుతులను కోరుకొండ నార్త్ జోన్ డీఎస్పీ సత్యనారాయణరావు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
చిన్న కొండేపూడి గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తితో అదే గ్రామానికి చెందిన సృజనకు గతేడాది మే నెలలో వివాహం జరిగింది. సృజన రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి నుంచి ఆడబిడ్డతో తల్లీ సృజన చిన్న కొండేపూడి గ్రామంలో తన పుట్టింటికి తీసుకుని వచ్చింది. కానీ సృజన తల్లీకి, ఆమె అమ్మమ్మకు ఆడ బిడ్డ పుట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్లు ఇంటికి వచ్చినప్పటి నుంచి సృజన అమ్మ మహాలక్ష్మి, ఆమె అమ్మమ్మ కనకరత్నం రోజూ ఆడబిడ్డ ఎందుకని, ఖర్చు తప్ప ఏమీ ఉండదని సూటిపోటి మాటలు మాట్లాడేవారు. పసిబిడ్డ ఆలనా పాలనా సరిగ్గా చూసేవారు కాదు. సృజన కూడా వారి మాటలకు ప్రభావితం అయ్యి సరిగా పాలు ఇచ్చేది కాదు.
పక్క ఇంటిలో నివాసం ఉంటున్న సృజన పెద్దమ్మ రోజూ వచ్చి పాపకి స్థానం చేయించేవారు. ఈ విధంగా ఆడబిడ్డ మీద ఉన్న వ్యతిరేకతతో ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు. ఆ దురుద్దేశంతో ఈనెల 18 అర్ధరాత్రి సమయంలో ప్లాన్ ప్రకారం ఒకే గదిలో పడుకుని ఉన్న సృజన, మహాలక్ష్మి, కనకరత్నం కలిసి గది బయటకు వచ్చారు. నిద్రపోతున్న పాపను తీసుకుని వారి ఇంటి సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లి అందులో వేసి చంపేశారు. తిరిగి ఏమీ తెలియనట్లు గదిలోకి వచ్చి పడుకున్నారు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కనకరత్నం రాత్రి మూడు గంటలకు లేచి పాప కనబడడం లేదని కేకలు వేసింది. పక్కనే ఉన్న సృజన, మహాలక్ష్మి కూడా లేచి పాపను ఎవరో తీసుకు వెళ్లిపోయినట్లు కథను అల్లారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ సత్యనారాయణ రావు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణీ మృతి