తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురైన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బోటు గోదావరి నదిలో 300 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారుల అంచనా. ఈ ప్రాంతం ప్రమాదకరమైనది కావటంతో సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కష్టాలు పడుతున్నారు.ఈ ప్రాంతంలో సహాయక చర్యలు అంత సులువు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కచ్చులూరు వెళ్లడానికే సరైన మార్గం లేదు. నదీ మార్గాన వెళ్లాలన్న దేవీపట్నం నుంచి గంటన్నర ప్రయాణించాలి. మొన్నటి దాకా ఈ ప్రాంతమంతా వరద బారిన పడి బురదతో నిండిపోయింది. దీనికి తోడు ఇప్పుడీ ప్రమాదం ముంచుకురావటంతో సహాయక చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వాడపల్లి వద్ద లాంచీ ప్రమాదం జరిగినప్పుడు రెండు వైపుల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తేనే చాలా సమయం పట్టింది. ఇప్పుడు గోదావరిలో లోతైన ప్రదేశంలో సహాయక చర్యలు అంత సులభం కాదని నిపుణులు వివరిస్తున్నారు. "ఇది అత్యంత ప్రమాదకర ప్రాంతం. ఇక్కడ సుడిగుండాలుంటాయి." అని బోట్ అక్కడికి చేరుకున్న సమయంలో టూరిస్ట్ గైడ్ ఒకరు మైక్‌లో పర్యటకులకు వివరించారు. అదే సమయంలో బటు ప్రమాదం జరిగిందని కొందరు తెలిపారు.
ఇవీ చదవండి
గోదావరి నీటిలోకి.. నిండు ప్రాణాలు