గోదావరిలో మునిగిన పర్యాటక బోటు చిక్కినట్లే చిక్కి చేజారిపోతోంది. నీట మునిగిన బోటుపై ఇసుక మేటలు వేయడంతో...ముక్కలు ముక్కలుగా బోటు భాగాలు బయటకు వస్తున్నాయి. డైవర్లు నీటిలోకి దిగి బోటుకు రోప్‌లు కట్టి యంత్రాలతో తీసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. నేడు మరోసారి బోటును బయటకు తీసేందుకు యత్నించనున్నారు.
బోటు మునిగి 37 రోజులు గడిచినా దరికి చేరలేదు. బోటును ఒడ్డుకు చేర్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బోటును వెలికితీసేందుకు విశాఖకు చెందిన డైవింగ్ నిపుణుల బృందం రెండో రోజూ ముమ్మరంగా ప్రయత్నించింది. నదిలోకి వెళ్లి మూడు గంటలపాటు శ్రమించి..... రెండు తాళ్లతో బోటును బిగించారు. అనంతరం ధర్మాడి సత్యం బృందం ప్రొక్లెయిన్ సాయంతో కమ్మీలు వేస్తూ బోటును బయటకు లాగే ప్రయత్నం చేసింది. ఇసుక మేటల కింద ఉన్న బోటు బయటకు రాకపోగా... బోటుకు చెందిన కొన్ని విడిభాగాలు మాత్రం ఊడి పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అందరిలోనూ తీవ్ర నిరాశ నెలకొంది.
నది లోపల పూర్తిగా ఇసుక మేటలు వేయడం, మట్టి దిబ్బలు పేరుకొని ఉండటం వల్లే బోటును లాగడం సమస్యగా మారిందని భావిస్తున్నారు. నేడు మరోసారి బోటును బయటకు తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నించనున్నారు.
ఇదీచదవండి