somu veerraju Fires on YSRCP: వైకాపా ప్రభుత్వంపై భాజపా పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలన దిగజారిపోయిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతోందని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రులు.. విచ్చలవిడిగా భూములు, వనరుల దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. కోనసీమ అల్లర్ల వైఖరిని భాజపా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా గోదావరి గర్జన సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. సభలో ప్రభుత్వంపై నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Jayaprada in AP Politics: ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్లాయి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పని చేయలేదు. ఏపీలో రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు.. కానీ పేదలకు ఒరిగిందేమీ లేదు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలేదు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. భాజపా గర్జనకు మద్దతిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భాజపాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది' అని పార్టీ శ్రేణులకు జయప్రద పిలుపునిచ్చారు. భాజపా నేతలు జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: