తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సింగం శివ గణేష్ హత్యను రాష్ట్ర ఎస్టీ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు తెలిపారు. బుధవారం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో మూడు రోజుల కిందట హత్యకు గురైన శివ గణేష్ (18) కుటుంబ సభ్యులను ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి పరామర్శించారు. ఈ సంఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లామని.. నిందితుడిని పోలీసులు కస్టడీలో తీసుకున్నారని కుంభా చెప్పారు.
అట్రాసిటీ చట్టం ప్రకారం.. మూడు నెలల లోపు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని... ఈ ఘటనపై నెల రోజుల్లోనే చర్యలు తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి ఇంటి స్థలం పట్టా, రెండు ఎకరాల భూమి, ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నామని.. అలాగే ఆర్థిక సహకారం కింద ప్రస్తుతం నాలుగు లక్షల 15 వేల రూపాయలు అందించామని చైర్మన్ తెలిపారు. హత్య చేసిన నిందితుడి తండ్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇది దురదృష్టకరమైన సంఘటన అని... ప్రతి ఒక్కరూ ఖండించాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి ఐదు లక్షలు తాను వ్యక్తిగతంగా సహాయంగా ఇచ్చినట్లు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తెలిపారు.
ఇదీ చదవండి:
పకోడి బండి వివాదంలో.. హత్యకు గురైన బాలుడి అంత్యక్రియలు పూర్తి