సాయం చేయాలని కోరాం...
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి చర్చించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సాయం చేయాలని కోరామని వివరించారు. అక్కడి కూలీలు, కార్మికుల కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పారు. సరిహద్దుల్లో ఉన్నవారికి ఆహారం, దుస్తులు అందించే యోచనలో ఉన్నామని వివరించారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడారని చెప్పారు.
13 కరోనా కేసుల్లో 12 పట్టణాల్లోనే...
13 కరోనా కేసుల్లో 12 కేసులు పట్టణాల్లోనే బయటపడ్డాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా నివారణకు పట్టణాలు, నగరాల్లో మరిన్ని చర్యలు చేపడతామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి వైద్యుడు, నిపుణుడు ఉన్నారన్న ఆళ్ల నాని... వైద్యులు, నిపుణుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉందని వివరించారు. విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. అవసరమైన వారిని ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నామని వెల్లడించారు. అవసరమైన మాస్కులు, పీపీఈలు, వెంటిలేటర్లు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
సూచనలు, సలహాలు తీసుకున్నాం...
కరోనాపై ఏర్పాటు చేసిన కమిటీ పలు విషయాలపై చర్చించిందని ఆళ్ల నాని వివరించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్ష జరిపామన్న మంత్రి... ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్టు తెలిపారు. పలువురు ఇచ్చిన సూచనలు, సలహాలు సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. నిత్యావసరాలు కొనుగోలు చేసే సమయంపైనా చర్చించినట్టు వివరించారు. పలుచోట్ల దుకాణాలు, మొబైల్ షాపులు ఏర్పాటుచేసే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ... 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే అనుమతించండి: సీఎం