Ainavilli MPDO Transfer: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయ రౌతులపూడి మండలానికి బదిలీ అయ్యారు. ఈ నెల 6న ఆమె కార్యాలయంలో వైకాపా నేత వాసంశెట్టి తాతాజీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పరుష పదజాలంతో ఎంపీడీవోను దూషించడంతో మనస్తాపానికి గురైన విజయ ముగ్గురు వైకాపా నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె బదిలీ కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఏం జరిగిందంటే..
అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయకు.. నల్లచెరువు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు తాతాజీ ఈనెల 6న సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జడ్పీటీసీకి ప్రోటోకాల్ పాటించటం లేదని.. తాము చెప్పినట్లు వినకపోతే చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
దీనిపై స్పందించిన ఎంపీడీవో విజయ.. కే.జగన్నాథపురంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వాలంటీర్లను తప్పించానన్నారు. వాలంటీర్లను తప్పించినందుకు.. జడ్పీటీసీ సభ్యుడికి ప్రోటోకాల్ పాటించలేదని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె వాపోయారు. ఈ క్రమంలోనే తనను హెచ్చరించిన తాతాజీతోపాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆర్టీవో వసంతరాయుడు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి
YSRCP Leader Warn To MPDO: 'చెప్పినట్లు వినకపోతే చీరేస్తాం'..ఎంపీడీవోకు వైకాపా నేత వార్నింగ్ !