తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు-గుజ్జు మామిడివలస కూడలి వద్ద.. భారీగా గంజాయి పట్టుపడింది. బుధవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టగా.. వేర్వేరు కేసుల్లో రూ.29 లక్షల విలువైన 1461 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు.
సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో మారేడుమిల్లి గుర్తేడు ఎస్సైలు వాహన తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా నుంచి హైదరాబాదుకు తరలిస్తున్న.. 1429 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ.28 లక్షలు ఉంటుందన్నారు. గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు కాగా.. మరో ఇద్దరు పరారైనట్లు తెలిపారు. ఐచర్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
- బోడాపూర్ నుంచి భద్రాచలానికి ద్విచక్ర వాహనంపై.. తరలిస్తున్న 24 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు వివరించారు. దీని విలువ రూ. 48 వేలు ఉంటుందన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి... ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
- విశాఖ జిల్లా సరిహద్దు నుంచి విజయవాడకు తరలిస్తున్న 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: మహిళలపై హత్యాచారం.. సీరియల్ కిల్లర్‌కు జీవిత ఖైదు