గోదావరి నదికి వచ్చిన భారీ వరదతో 24 గంటల్లో 150 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ధవళేశ్వరం నుంచి 551.37 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లగా, మంగళవారం ఉదయం ఆరు గంటలకు 150.70 టీఎంసీలు వెళ్లాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయానికి ఇంకా ఎక్కువ నీరు వెళ్లనుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు గోదావరికి అత్యధిక వరద వచ్చింది. ఇంత పెద్ద వరదల్లో ఇది రెండోది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు 18,00,963 క్యూసెక్కులు గోదావరి నుంచి సముద్రానికి వెళ్లగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు 22.58 లక్షల క్యూసెక్కులు వెళ్లినట్లు సంబంధిత ఇంజినీర్లు ప్రకటించారు. అయితే భద్రాచలం వద్ద సాయంత్రం ఐదు గంటల సమయానికి క్రమంగా నీటిమట్టం తగ్గి 52.3 అడుగులకు చేరడంతో పాటు నీటి ప్రవాహం 13.80 లక్షలకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకొంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ దిగువన శబరి, సీలేరు నుంచి, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదతో కలిపి ధవళేశ్వరం వద్ద 22 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చింది. అత్యధికంగా 1986 ఆగస్టు 16న 30.81 లక్షలు, 1990 ఆగస్టు 25న 21.83 లక్షల క్యూసెక్కులు రాగా, ఇప్పుడు 22.58 లక్షల క్యూసెక్కులు రావడంతో 1986 తర్వాత గోదావరికి రెండో అతి పెద్ద వరదగా పోలవరం ఇంజినీర్లు పేర్కొన్నారు.
- శ్రీరామసాగర్ నుంచి ధవళేశ్వరం వరకు..
గోదావరిలో శ్రీరామసాగర్ నుంచి ధవళేశ్వరం వరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 90.313 టీఎంసీల సామర్థ్యం గల శ్రీరామసాగర్ ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 55 టీఎంసీలు ఉండగా, 60వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రాజెక్టు నిండటానికి ఇంకా 35 టీఎంసీలు అవసరం. దిగువన కడెం నుంచి ఆరువేల క్యూసెక్కులు వదిలారు. 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటిమట్టంతో నిండు కుండలా ఉంది. ఎల్లంపల్లిలోకి 51వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 44వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెట్టారు. ఎల్లంపల్లి నుంచి వదిలిన నీటితోపాటు మానేరు నది నుంచి వచ్చే నీటితో అన్నారం(సరస్వతి బ్యారేజి) నుంచి 25గేట్లు ఎత్తి లక్షా 42వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మానేరు నదిపై సోమనపల్లి వద్ద ఉన్న కేంద్ర జల సంఘం గేజ్ చెంత మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు 82వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఎల్లంపల్లి, మానేరుల వరదను బట్టి అన్నారం నుంచి... గోదావరి, ప్రాణహిత నీటి ఆధారంగా మేడిగడ్డ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం ఆరుగంటలకు మేడిగడ్డకు 3.85 లక్షల క్యూసెక్కులు రాగా, 4.05 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువన ఇంద్రావతి నుంచి, అలాగే వాగులు, వంకల ద్వారా వచ్చే వరద కలిపి భద్రాచలం దగ్గర 13.8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. భారీ వర్షాలతో ఎక్కువ ప్రవాహం ఉండటంతో ధవళేశ్వరం వద్ద 22 లక్షల క్యూసెక్కులకు మించి ప్రవహిస్తోంది.
ఇదీ చూడండి. వరద ఉద్ధృతితో భయం భయం.. జలదిగ్బంధంలోనే గ్రామాలు