అస్తవ్యస్తంగా వేలాడే విద్యుత్తు తీగల నుంచి తిరునగరి వీధులు బయటపడనున్నాయి. నగర సుందరీకణలో భాగంగా విద్యుత్ కేబుళ్ల వ్యవస్థ ప్రభుత్వం ప్రక్షాళనపై దృష్టి సారించింది. నగరంలో మొత్తం 8 సబ్ స్టేషన్ల పరిధిలో భూగర్భంలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సంయుక్తంగా తిరుపతి నగరంలో భూగర్భ విద్యుత్ తీగల వ్యవస్థ ఏర్పాటును చేపట్టాయి. చిన్నపాటి గాలి వీచినా... చిరు జల్లులు కురిసినా మృత్యుపాశాలుగా మారుతున్న విద్యుత్ కేబుళ్ల వ్యవస్థను ఈ రెండు సంస్థలు శాశ్వత ప్రక్షాళన చేయనున్నాయి.
ప్రపంచ బ్యాంకు సాయంతో..
నగర వ్యాప్తంగా మొత్తం 150 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 65 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 55 కిలోమీటర్ల మేర భూగర్భ కేబుళ్ల ఏర్పాటు పూర్తైంది. 80 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా 30 కిలోమీటర్ల పనిని పూర్తి చేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ కేబుళ్ల వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందుకోసం 188 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అందులో విద్యుత్ పంపిణీ సంస్థకు 112 కోట్లు కేటాయించగా....నగరపాలక సంస్థకు 76 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.
రెండు దశలుగా..
రెండు దశలుగా భూగర్భ కేబులింగ్ వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. అమర్ రాజా పవర్ సిస్టమ్స్ టెండర్ ద్వారా ఈ బాధ్యతలు అప్పగించారు. నగరంలో ప్రధాన రహదారులైన అలిపిరి రోడ్, తిరుమల బైపాస్ రోడ్ , రుయాసుపత్రి, మహతి, బాలాజి కాలనీ మీదుగా ఎస్వీయూ సబ్ స్టేషన్ల వరకు కేబుళ్లను అమర్చనున్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా రెండు ఇండోర్ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ఆరు నెలల నుంచి సంవత్సరం కాలంలో పనులన్నింటినీ పూర్తి చేసి భూగర్భ విద్యుత్ కేబుళ్ల నగరంగా తిరుపతిని తీర్చిదిద్దనున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.