చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నీటి ఎద్దడి తీవ్రమైంది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో నీరు సరఫరా కాని కారణంగా.. మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలతోపాటు ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో సమస్య తీవ్రమవుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంతోపాటు పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం, గుర్రంకొండలోనూ నీటి ఎద్దడి నెలకొంది. పుంగనూరు మున్సిపాలిటీలో నాలుగైదు రోజులకోసారి, మదనపల్లె గ్రామీణ మండలంలో 10- 15 రోజులకోసారి కుళాయిల ద్వారా నీరు విడుదల చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
మదనపల్లె పట్టణానికి సమీపంలోని రంగారెడ్డి కాలనీలో ఓ ఇంటి యజమాని ట్యాంకరుతో సంపులోకి నీరు నింపుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందాడు. ఇక్కడ సుమారు 4వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 20- 30 రోజులకోసారి ఓవర్‌హెడ్ ట్యాంకు నుంచి పైప్‌లైన్‌ల ద్వారా అరగంట నుంచి గంట మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితోనే వారు సుమారు 20 రోజులు కాలం వెళ్లదీయాలి.
స్తోమత ఉన్నవారు రూ.800- రూ.1000 చెల్లించి ప్రైవేటుగా ట్యాంకరు నీరు కొనుగోలు చేస్తున్నారు. నీటిని విడుదల చేసినప్పుడు కొందరు మోటార్ల ద్వారా సంపులు నింపుకోవడటంతో శివారు ప్రాంతాలకు నీరు అందడంలేదు. ఫలితంగా.. పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: