చిత్తూరు జిల్లాను నీటి సమస్యలు వేధిస్తున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 12 వందల 45 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా పల్లెల్లో తాగునీటి సమస్య ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న 18 వేల వ్యవసాయ బోర్లలో... 70 శాతం ఎండిపోయాయి. రెండు వేల వరకు చేతి పంపులు.. స్పెయిన్ సాంకేతికతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాశ్వత తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి.
చేసేదేమి లేక జనాలు దిక్కుతోచని పరిస్థితుల్లో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డారు. వాటికి సైతం నీరు దొరకడం లేదని యజమానులు చేతులెత్తేస్తున్నారు. ట్యాంకర్‌కు ఎక్కువ ధరలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు . విధిలేని పరిస్థితిలో తాగునీటికి, నిత్య అవసరాలకు అవసరమైన నీటిని.. ట్యాంకర్ కు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు చెల్లించి కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండిపోతున్న బోర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా... నీటి అన్వేషణలో అధికారులు తలమునకలవుతున్నారు. కొందరు దాతలు మూగ జీవాలకోసం నీటిని చెక్ డ్యాములు, ఇంకుడు గుంతల్లోకి వదిలి వాటి దాహం తీరుస్తున్నారు. హంద్రీనీవా కాలువలలో ప్రవహించే నీటిని ఈ ప్రాంత చెరువులకు నింపి శాశ్వతంగా నీటి సమస్యకు పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చూడండి-శ్రీవారి రథం లాగిన త్రివిక్రమ్ దంపతులు