చిత్తూరు జిల్లాలో రూ.12 వేలు చెల్లిస్తే.. జీవితాంతం రూ.2,500 పింఛన్ ఇస్తామంటూ.. ప్రజలను మోసం చేసిన రూపేష్‌కుమార్ జాడ ఇప్పటికీ తెలియలేదు. జిల్లాలోని పడమటి మండలాలతోపాటు అనంతపురం, కడప, కర్ణాటకలోని సుమారు 30వేల మందిని మోసం చేసిన రూపేష్ కుమార్ ఉదంతం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నవంబరు మొదటి వారంలో అదుపులోకి తీసుకొని.. విచారించే క్రమంలో ములకలచెరువు పోలీసుస్టేషన్ నుంచి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ తొలుత ఓ ఎస్సై, విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. అనంతరం ఎస్సైను తప్పించి.. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ప్రజల నుంచి సుమారు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిన వ్యక్తి విచారణ కీలక దశలో పోలీసు స్టేషన్ నుంచే పరారు కావడంతో.. ఈ ఘటన వెనుక శాఖలోనే ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే ఆరోపణలు వచ్చాయి. పలువురు డిపాజిట్‌దారుల్లోనూ ఇదే అనుమానం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్పీ సెంథిల్‌కుమార్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. నిందితుడిని పట్టుకోవడానికి ములకలచెరువు సీఐ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. రెండు నెలలకుపైగా వీరు రూపేష్ జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదని తెలుస్తోంది. మరోవైపు డబ్బులు చెల్లించిన వారు తమ సొమ్ము తిరిగి వస్తుందా లేదా అన్న ఆందోళనతో ఉన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తొలినాళ్లలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నామని.. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు.నిందితుడు పరారైనా ఇప్పటికీ ఆచూకీ కనుక్కోలేక పోయారు.
నిందితుడి తండ్రి అదుపులోనే ఉన్నా..
నిందితుడు పారిపోవడంతో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పెద్దమండ్యం మండలం చెరువుకిందపల్లెకు చెందిన రూపేష్ తండ్రి చంద్రప్పను నవంబరు 12న అరెస్టు చేసినట్లు సీఐ సురేష్‌కుమార్ తెలిపారు. ఆయన నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తండ్రి అదుపులోనే ఉన్నందున కుమారుడిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈక్రమంలో నిందితుడి ఫోన్‌పై నిఘా ఉంచినా.. ఇప్పటికీ ఫలితం లేదు. అతని సమీప బంధువులు, స్నేహితులకు అందుబాటులోకి వస్తాడని వేచి చూస్తున్నా.. నిరాశే మిగిలింది.
తాజాగా మళ్లీ ఆందోళన
న్యాయం కోసం బాధితులు మదనపల్లె సబ్‌కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తూనే ఉన్నారు. వేర్వేరు చోట్ల ఉన్న రూపేష్ ఆస్తులను వేలం వేయాలని పేర్కొన్నారు. స్టేషన్ నుంచి పరారైన వ్యక్తిని అరెస్టు చేయడంలో జాప్యం వెనుక మతలబు ఏంటో తేల్చాలన్నారు. పెద్ద పెద్ద కేసులను రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులకు ఈ కేసు ఎందుకు కష్టతరంగా మారిందో అర్థం కావడంలేదన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరైనా పెద్దల ప్రమేయం ఉందా అనే అనుమానాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం
ఈ విషయమై మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన బృందాలు గాలిన్నాయని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.
ఏజెంట్ల వివరాల సేకరణ
మొత్తం ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు? ఎంత సొమ్ము వసూలు చేశారు? ఆ డబ్బుతో ఏం చేశారనే సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే కొందరు ఏజెంట్లను స్టేషన్‌కు పిలిపించి.. డిపాజిట్‌దారుల నగదు ఇవ్వాలని హెచ్చరించారు. దీంతో పలువురు నగదును పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. విచారణ ఓ కొలిక్కి వస్తోంది.. డిపాజిట్‌దారులకు ఎంతోకొంతైనా మేలు జరుగుతుందని భావిస్తున్న తరుణంలోనే రూపేష్‌కుమార్ పరారు కావడం అలజడిని రేపింది.
ఇదీ చదవండి