చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అనధికారికంగా విగ్రహాలను ఏర్పాటు చేసిన నిందితులను 48 గంటల్లో అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలోని భాజపా నేతలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆయన పరిశీలించారు. ఆలయం లోపల కాశీ, రామేశ్వర విగ్రహాల పక్కన అనధికారికంగా ఏర్పాటు చేసిన శివలింగం, నందీశ్వరుడు ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం, భద్రత సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగతున్నాయని పేర్కొన్నారు.
ఈనెల ఒకటి నుంచి 14వ తేదీ వరకు దర్శనానికి వచ్చిన భక్తుల వివరాలను ఆలయ అధికారులు నమోదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సంఘటనలు జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం దుర్మార్గం : చంద్రబాబు