చిత్తూరు జిల్లాలో ఇసుక కొరతను కొందరు దళారులు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక కోసం నమోదు చేసుకోవటం రాక... స్టాక్ పాయింట్‌ల చుట్టూ తిరుగుతున్న వినియోగదారుల అవసరాల్ని ఆసరాగా చేసుకుని పేట్రేగిపోతున్నారు. ట్రాక్టర్‌కైతే ఓ రేటు...టిప్పర్‌కైతే మరో ధరను నిర్ణయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది.. రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం ఇసుక స్టాక్ పాయింట్‌లో జరుగుతున్న అక్రమాలు. వీటిపై ఈటీవీ-ఈనాడు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి.
ఈ ఇసుక స్టాక్ పాయింట్....తిరుపతి జాతీయ రహదారిని ఆనుకుని...స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ట్రాక్టర్ ఇసుకను రూ.4500 గా విక్రయిస్తుంటే.. ప్రైవేట్‌లో ట్రాక్టర్ ఇసుక 5వేల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకుంటే...స్టాక్ పాయింట్ నుంచి మట్టిని డెలివరీ చేశారని పలమనేరుకు చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అవసరాలకు కావలసినంత ఇసుక అందుబాటులో లేకపోవటం వల్ల ఈ అక్రమాలకు తెర లేచింది.
ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ తీసుకువచ్చి అక్రమ మార్గాలకు అడ్డుకట్టు వేస్తామని చెబుతున్నా.. స్టాక్ పాయింట్, ర్యాంప్‌ల వద్ద అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఇదీచదవండి.