నకిలీ వెబ్‌సైట్ల బారినపడి మోసపోతున్న శ్రీవారి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాధితుల ఫిర్యాదులతో తితిదే అప్రమత్తమైంది. ఆర్జిత సేవలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి పేరిట భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల్‌పై దృష్టి సారించింది. ఫిర్యాదులపై విచారణ చేపట్టిన తితిదే నిఘా విభాగం... నకిలీ వెబ్‌సైట్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించింది.
టీటీడీ టికెట్స్ డాట్‌కామ్, టీటీడీ దర్శన్ డాట్‌కామ్, తిరుపతి బాలాజీ దర్శన యాత్ర టికెట్ డాట్‌కామ్, మై బాలాజీ డాట్ఇన్, బుకింగ్ తిరుపతి దర్శన్ డాట్‌కామ్ వంటి 20 నకిలీ వెబ్‌సైట్ల ద్వారా... కొందరు వ్యక్తులు మోసగిస్తున్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణ నిర్వహించిన తితిదే నిఘా విభాగం... నకిలీ వెబ్‌సైట్లపై తిరుపతి తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నకిలీ సైట్ల మాయలో పడి టికెట్లు కొన్న భక్తులు... తిరుమల చేరుకునే వరకు మోసపోయామని గ్రహించలేకపోతున్నారు. ఇటీవల వీరి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు మోసపోవడం... తరచూ ఇదే ఘటనలు పునరావృతం అవుతుండటం. కారణంగా.. నకిలీ సైట్లను అరికట్టేందుకు తితిదే చర్యలు చేపట్టింది. నకిలీ సైట్ల వివరాలతో గూగుల్, గో డాడీ సంస్థలకు తితిదే నిఘా విభాగం ఫిర్యాదు చేసింది. స్పందించిన ఆ సంస్థలు 9 వైబ్‌సైట్లను బ్లాక్ చేశాయి.
శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారికంగా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్, టీటీడీ సేవా ఆన్‌లైన్ డాట్ కామ్ వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని కోరుతోంది. తితిదేకు సంబంధించిన సమాచారం కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ తిరుమల డాట్ వోఆర్జీ వైబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచిస్తోంది.
ఈ ఏడాదిలోగా జమ్ముకశ్మీర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. జమ్ములో తితిదే అధికారులు, స్తపతి ఎంపిక చేసిన నాలుగు స్థలాల్లో... అంతిమంగా ఒకదానిని నిర్ణయించి.. ఈ ఏడాదిలోపే నిర్మాణ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండీ... పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రూ.5.28 కోట్ల జరిమానా