అలనాటి సినీనటి కాంచన 2010లో చెన్నై నగరం నడిబొడ్డున రూ.15 కోట్ల స్థిరాస్తిని శ్రీవారికి కానుకగా సమర్పించారు. అప్పటి తితిదే ఈవో ఐవైఆర్ కృష్ణారావును కలిసి దానపత్రాలు అందజేస్తూ ఈ ఆస్తిని విక్రయించకుండా దేవస్థానం అవసరాలకు కలకాలం వాడుకోవాలని ఆనందబాష్పాలతో వేడుకున్నారు. దాత మనసు ఎలా ఉంటుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. అప్పటికి కాంచన ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుతున్నారు. దాత మనోభావాన్ని గుర్తించిన అప్పటి ఈవో.. తప్పకుండా శ్రీవారి పేరిటే ఆస్తి ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- దేశ విదేశాల్లో దేవస్థానానికి వివిధ రకాల ఆస్తులున్నాయి. వీటిని బహిరంగపరిస్తే రక్షణ ఉంటుందనే సంకల్పంతో తితిదే ఈవోగా పనిచేసిన సాంబశివరావు తితిదే వెబ్‌సైట్‌లో వాటి వివరాలు పొందుపర్చి భక్తకోటికి తెలిసేలా చర్యలు తీసుకున్నారు.
లాక్‌డౌన్‌తో శ్రీవారి దర్శనానికి భక్తులను రెండు నెలలుగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో దేవస్థానానికి ఆదాయం తగ్గిపోయిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు తలెత్తాయనే కథనాలు వచ్చాయి. దీనికి దేవస్థానం అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేదు.
ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూలతో జిల్లాలకు తరలిన వాహనాలు